- రాష్ట్రంలో ఇక ఆ పార్టీ కోలుకోదు
- ‘మంత్రులతో ముఖాముఖి’లో జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రాష్ట్రంలో ఇక ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని అన్నారు. గురువారం గాంధీ భవన్ లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు నిరంకుశంగా పాలించారని, తన నియోజకవర్గంలో కూడా దుర్మార్గంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు .
ప్రజల స్వేచ్ఛను హరించి, పత్రిపక్షంతో పాటు సొంత పార్టీ నేతల గొంతునొక్కారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నిర్వాకం వల్లే ఇప్పుడు అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేస్తున్నదని చెప్పారు. ‘‘ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి అందరినీ కలుపుకొనిపోతున్నారు.
మా ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నది. ప్రజాభవన్ తో పాటు జిల్లాల్లో ప్రజావాణి ద్వారా ప్రజల వినతులను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వారంలో ఒకరోజు మంత్రులు గాంధీ భవన్‌లో అందుబాటులో ఉండేటట్లు ప్రజలతో మంత్రుల ముఖాముఖి ఏర్పాటు చేశాం. దీంతో సరికొత్త సంప్రదాయానికి నాంది పలికాం” అని జూపల్లి పేర్కొన్నారు.